Toyota Innova Crysta | మార్కెట్‌లోకి టయోటా ఇన్నోవా క్రిస్టా..

Toyota Innova Crysta | మార్కెట్‌లోకి టయోటా ఇన్నోవా క్రిస్టా..

Toyota Innova Crysta | ధర రూ.19.72 లక్షల నుంచి ప్రారంభం
ప్రీమియం లుక్, కొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు
ఈ మోడ‌ల్‌లో ఇదే ఆఖ‌రి అప్డేట్‌

Toyota Innova Crysta | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంవీపీ (MPV) వాహనాల్లో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) కొత్త అప్‌డేట్లతో మరోసారి మార్కెట్‌లోకి వచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 2026 ఇన్నోవా క్రిస్టా మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో డిజైన్‌ను పెద్దగా మార్చకుండా, బాహ్య రూపురేఖలు, క్యాబిన్, సౌకర్యాలు, భద్రతా ఫీచర్లను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దింది. భారీ కుటుంబాలు, టూరిజం ఆపరేటర్లు, కమర్షియల్ వినియోగదారుల్లో మంచి పేరు సంపాదించిన ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు మరింత ప్రీమియం లుక్, కొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. డీజిల్ ఇంజిన్ నమ్మకత్వం, సౌకర్యవంతమైన ప్రయాణం, అధిక రీసేల్ విలువ కారణంగా ఈ మోడల్‌కు ఇంకా మంచి డిమాండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 మోడల్ ఇన్నోవా క్రిస్టాకు చివరి ప్రధాన అప్‌డేట్‌గా భావిస్తున్నారు. 2027 నాటికి ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసి, కంపెనీ పూర్తిగా కొత్త తరం హైబ్రిడ్, ఎలక్ట్రిఫైడ్ వాహనాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై టయోటా నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ధరలు ఇలా..
కొత్త ఇన్నోవా క్రిస్టా ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.72 లక్షల నుంచి ప్రారంభమై రూ.26.63 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ల వారీగా ధరలు ఇలా ఉన్నాయి:

GX (7 సీటర్) – రూ.19.72 లక్షలు
GX+ – రూ.21.15 లక్షలు
VX – రూ.24.93 లక్షలు
ZX – రూ.26.63 లక్షలు

కొత్తగా జ‌రిగిన మార్పు?
ఇన్నోవా క్రిస్టా బాడీ డిజైన్‌ను టయోటా యథాతథంగా ఉంచింది. అయితే ముందు భాగంలో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్లు, క్రోమ్ గార్నిష్‌లతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. దీంతో వాహనానికి మరింత ప్రీమియం లుక్ వచ్చింది.

క్యాబిన్‌లో ప్రీమియం ఫీల్
వాహనం లోపల కొత్త డ్యూయల్-టోన్ సీటు అప్హోల్స్టరీ, గ్రేస్ కాపర్ ఫినిష్, వుడ్-ప్యాటర్న్ ఇన్‌సర్ట్‌లు అందించారు. స్టీరింగ్, డోర్ ట్రిమ్స్, ఏసీ కంట్రోల్స్, రెండో వరుస సీట్ల టేబుల్ భాగాల్లోనూ మార్పులు చేశారు. దీంతో ప్రయాణికులకు మరింత విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది.

కొత్త ఫీచర్లు
వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్
టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

ఇంజిన్, మైలేజ్
వాహనంలో ఎలాంటి యాంత్రిక మార్పులు చేయలేదు. గత మోడల్‌లో ఉన్నట్లుగానే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 148 బీహెచ్‌పీ శక్తి, 343 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ వాహనం లీటర్‌కు సుమారు 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

భద్రతకు ప్రాధాన్యం
7 ఎయిర్‌బ్యాగ్‌లు
ABS + EBD
వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC)
హిల్ స్టార్ట్ అసిస్ట్
బ్రేక్ అసిస్ట్

CLICK HERE TO READ Sensex 252.58 | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

CLICK HERE TO READ MORE