యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది
- ఏసీ బోగీ బ్యాటరీలో సాంకేతిక లోపం..
- జహీరాబాద్‌లో నిలిపివేసిన రైలు
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : బీదర్ నుంచి యశ్వంతపూర్‌కు వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో ఇంజిన్ వెనుక ఉన్న ఏసీ కోచ్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే రైలును స్టేషన్లో నిలిపివేశారు.
సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది ఏసీ బోగీని క్షుణ్ణంగా పరిశీలించగా, బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే పొగలు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పూర్తిగా పరిష్కరించారు.
లోపం సరిచేసిన అనంతరం రైలును యథావిధిగా యశ్వంతపూర్ వైపు పంపించారు. ఈ ఘటన కారణంగా రైలు కొద్దిసేపు ఆలస్యంగా బయలుదేరింది. రైల్వే అధికారుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల రైళ్లలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఈ ఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైళ్ల నిర్వహణ, సాంకేతిక తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
