ఘనంగా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’

ఘనంగా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’

  • ఐఐటీ తిరుపతిలో ఆరు రోజుల పాటు కార్యక్రమాలు
  • విద్య, సంస్కృతి, పరిశ్రమలపై సమగ్ర అవగాహన లక్ష్యం
  • తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీహరికోట వంటి ప్రాంతాల సందర్శన
  • రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనకు వేదికగా కార్యక్రమం

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ యువ సంఘం-6 కార్యక్రమం శనివారం ఐఐటీ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సుమారు 50 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు.

ప్రముఖ ప్రదేశాల సందర్శన

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తిరుపతి జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రం, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం, ఎస్వీ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. అదనంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని అభివృద్ధి పనులు కూడా వారికి చూపించనున్నారు. ఈ సందర్శనల ద్వారా విద్యా వ్యవస్థ, సంస్కృతి, పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై పరస్పర అవగాహన పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఐఐటి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు.

త్వరలోనే మహారాష్ట్రకు ఏపీ విద్యార్థులు

ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులతో యూత్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి మహారాష్ట్రకు పంపే కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. దేశం నలుమూలల విద్యా వ్యవస్థ, సంస్కృతి, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో జాతీయ ఐక్యత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply