దుర్గమ్మ జాతరల్లో జగ్గారెడ్డి సందడి..

  • పోతరాజులతో కలిసి చిందులు..
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • ప్రజలంతా సుఖసంతోషాలు, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్ష

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): ఆషాఢమాసం సందర్భంగా సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో నిర్వహించిన దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. సదాశివపేటలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన హారతి సమర్పించారు. అనంతరం పోతరాజులు, భక్తులతో కలిసి ఉత్సాహంగా చిందులు వేస్తూ జాతరలో సందడి చేశారు.

జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులతో మమేకమై పలువురితో ఆప్యాయంగా మాట్లాడారు. జగ్గారెడ్డితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జరుగుతున్న దుర్గమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తుల రంగాన్ని ఆలకించిన అనంతరం జాతర సంప్రదాయ క్రతువులను దగ్గరుండి నిర్వహింపజేశారు. పోతరాజులతో కలిసి నృత్యం చేస్తూ భక్తుల ఉత్సాహంలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… ఆషాఢమాసంలో దుర్గమ్మ తల్లి జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ప్రజలు తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు పెద్దఎత్తున జాతరకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ నెల 9న నిర్వహించనున్న బోనాల మహోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.