సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

మాధవరంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీలు

కర్నూలు ప్రతినిధి (ఆంధ్రప్రభ): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాల జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టిన భద్రతా, ఇతర ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, రూట్ బందోబస్తు, సెక్టార్‌ల వారీగా విధులు నిర్వహించే అధికారుల బాధ్యతలు, భద్రతా ఏర్పాట్లపై నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు సమగ్రంగా వివరించారు.

అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, నంద్యాల స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివాసరెడ్డి, కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.