హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘ప్రజా పాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో పాల్గొని ‘బిల్డ్ నౌ పోర్టల్‌సను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గతంలో పేదలకు వేరుగా పెద్దలకు వేరుగా నిర్మాణ అనుమతులు ఉండేవని, ఇప్పుడు ఎంత పెద్దోడైనా బిల్డ్ నౌ వెబ్‌సైట్లో అప్లై చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కన్నా.. జడ్పీటీసీగా విజయం సాధించినప్పుడే ఎక్కువ సంతోషం కలిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చామని, 30, 40 రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చిండు.. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుల పర్యవసానాలను మనం ఎదుర్కొంటున్నాం. కేసీఆర్ తీసుకున్న అప్పులు.. చేసిన తప్పులకు రూ.లక్ష 53 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. నా దగ్గర రూ.లక్ష 53 వేల కోట్లు ఉంటే, క్షణంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేసేవాడిని అని పేర్కొన్నారు.