యోగా పండ‌గ‌కు స‌ర్వం సిద్ధం..

యోగా పండ‌గ‌కు స‌ర్వం సిద్ధం..

15 రోజులపాటు నిర్వహణ.
ఈ నెల 7న పోలీస్ థీమ్ యోగా కార్య‌క్ర‌మం
ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు
విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో నిత్య యోగా
ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాలి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు

విజయవాడ, ఆంధ్రప్రభ : స్వ‌ర్ణాంధ్ర‌-ఆరోగ్యాంధ్ర ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ నెల 7 నుంచి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ‌మైన 21వ తేదీ వ‌ర‌కు పండ‌గ‌లా యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంద‌ని.. జిల్లాలోనూ ఊరూవాడా యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, అడిష‌న‌ల్ సీపీ కేజీవీ స‌రిత, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి యోగాంధ్ర‌-2026పై శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ నిర్మాణం, ప్ర‌తి ఇంటికి యోగాను చేర‌వేయ‌డం, ప్ర‌జ‌ల్లో నిత్య యోగా సాధ‌న అల‌వాటును పెంపొందించే ల‌క్ష్యంతో యోగాంధ్ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 7న పోలీసు సిబ్బందితో బీఆర్‌టీఎస్ రోడ్డులో థీమాటిక్ యోగా, ఈ నెల 10న ప‌విత్ర సంగమం వ‌ద్ద‌, 13వ తేదీన బెర్మ్ పార్కు వ‌ద్ద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ప్ర‌తిరోజూ ఉద‌యం 6 గంట‌ల‌కు నిత్య యోగా కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని.. రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, వైద్యులు, కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులు, వ‌యోవృద్ధులు, ఉపాధ్యాయులు..

ఇలా వివిధ వ‌ర్గాల‌కు ఇందులో భాగ‌స్వాముల‌ను చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. గ్రామాల్లో, వార్డుల్లో, దేవాల‌యాలు, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, పార్కులు, మైదానాలు త‌దిత‌ర ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జూన్ 21న జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని.. జిల్లాలో 300 మంది మాస్ట‌ర్ ట్రైన‌ర్లు, అయిదు వేల మందికిపైగా యోగా శిక్ష‌కులు అందుబాటులో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కృష్ణాన‌ది వెస్ట్‌బైపాస్ రోడ్డుపై రాష్ట్రస్థాయి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని.. ఇందులో ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొంటార‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు కూడా కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములవుతార‌ని.. ఇదేవిధంగా ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములై కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.

గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు యోగా పోటీలు..

ఈ నెల 7 నుంచి 9వ తేదీ వ‌ర‌కు గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫ‌ర్ ఆల్ – గ్రాస్‌రూట్స్ వెల్‌నెస్ ఇతివృత్తంతో పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఔత్సాహికులు స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌స్థాయిలో విజేత‌లు మండ‌ల స్థాయికి, మండ‌ల‌స్థాయిలో విజేత‌లు జిల్లాస్థాయికి, అక్క‌డ విజేత‌లుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటార‌ని వివ‌రించారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వ‌ర‌కు యునిటీ త్రో యోగా-బ్రిడ్జింగ్ క‌మ్యూనిటీస్ థీమ్‌తో మండ‌ల‌స్థాయిలో, ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు యోగా అండ్ యూత్ – బిల్డింగ్ ఎ హెల్దీ ఫ్యూచ‌ర్ థీమ్‌తో జిల్లాస్థాయిలో, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు యోగాంధ్ర‌-ఆంధ్రాస్ గ్లోబ‌ల్ యోగా షోకేజ్ థీమ్‌తో రాష్ట్ర‌స్థాయిలో పోటీలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

వ్య‌క్తిగ‌త కేట‌గిరీ (ఆస‌న‌, ప్రాణామాయ ప్ర‌ద‌ర్శ‌న‌లు), గ్రూపు కేట‌గిరీలో సింక్ర‌నైజ్డ్ గ్రూప్ యోగా పోటీలు ఉంటాయ‌ని.. అదే విధంగా యోగా క్విజ్‌, యోగా స్లోగ‌న్ పోటీలు కూడా నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. జూనియ‌ర్ (10-18 ఏళ్లు), యంగ్ (19-35 ఏళ్లు), సీనియ‌ర్ గ్రూప్ (35 ఏళ్లు, ఆపైన‌) విభాగాల్లో పోటీలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మ‌హిళ‌లు, పురుషుల‌కు వేర్వేరుగా పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. పోటీల్లో విజేత‌ల‌ను రాష్ట్ర‌స్థాయి కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

నేర నియంత్ర‌ణ‌కు యోగా ఓ మంచి మార్గం

మ‌నిషికి శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్య‌మూ ముఖ్య‌మ‌ని.. నేర నియంత్ర‌ణ‌కు, నేర ర‌హిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గ‌మ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు. డ్ర‌గ్స్‌పై దండ‌యాత్ర 2.0ను విజ‌య‌వంతంగా నిర్వహిస్తున్నామ‌ని… ఇందులో గుర్తించిన గంజాయి పాజిటివ్స్‌కు కూడా 28 పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో యోగా కార్య‌క్ర‌మాలు, శిబిరాలు నిర్వహించి మంచి మార్గంలో న‌డిచేలా, జ‌న‌జీవ‌న స్ర‌వింతిలోకి తీసుకొచ్చేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌న్నారు. జిల్లాలో పోలీస్ థీమ్ యోగాకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు పేర్కొన్నారు.

జిల్లా ఆయుష్ అధికారి డా. వై.ర‌త్న ప్రియ‌ద‌ర్శిని మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యవంతమైన వృద్ధాప్య జీవనానికి యోగా థీమ్‌తో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ కార్య‌క్ర‌మాలు జరుగుతాయ‌ని తెలిపారు. జీవితంలో ఏ సంక్షోభం ఎదురైనా ఆత్మ‌స్థైర్యంతో ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఉండాలంటే శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాల‌ని, అదే నిజ‌మైన ఆరోగ్యమ‌ని పేర్కొన్నారు. ఆయుష్‌, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పోలీస్‌, యువ‌జ‌న సంక్షేమం, క్రీడ‌లు, విద్య, పంచాయ‌తీరాజ్‌, మునిసిపల్ ఇలా వివిధ శాఖ‌ల స‌హ‌కారంతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని తెలిపారు. స‌మావేశంలో జిల్లా ఆయుష్ అధికారి డా. వై. ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ, డీఎంహెచ్‌వో డా. జె.ఇందుమ‌తీదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply