ఆ ఇద్దరి దందాకు చెక్ పెట్టిన పోలీసులు..
ఆ ఇద్దరి దందాకు చెక్ పెట్టిన పోలీసులు..
నకిరేకల్, ఆంధ్ర ప్రభ : అమాయకులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసి ఆన్ లైన్ లో పేకాట ఆడుతున్న కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి (DSP Shivaram reddy) వివరించారు. ముద్దం బాలరాజు నకిరేకల్ (Nakirekal) పట్టణంలో ఉంటూ తన కార్లను సెల్ఫ్ డ్రైవ్ లకు ఇస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఆ తరువాత కిరాయిలు ఎక్కువ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడేవాడు. అతనికి నోముల గ్రామానికి చెందిన సామ విక్రమ్ రెడ్డితో ముందు నుండి పరిచయం ఉండేది. విక్రమ్ రెడ్డి వాళ్ళకు వాళ్ళ గ్రామానికి చెందిన సామ సురేందర్ రెడ్డితో భూమి తగాదాలు ఉన్నాయి. కొన్ని సార్లు అతను కూడా ఆ పంచాయితీకి పెద్ద మనిషిగా వెళ్ళేవాడు. సామ విక్రమ్ రెడ్డి, వాళ్ళ తల్లిదండ్రులు అమాయకంగా ఉంటూ ఎవరు బెదిరించినా భయపడేవాళ్లు. వారి భూమి పంచాయతీ సమయములోనే బాలరాజు వాళ్ళకు చాలా దగ్గర అయ్యాడు.
బాలరాజు ఒకసారి తనకు నకిరేకల్ లోని ఒక హాస్పిటల్ దగ్గర ఒక ప్లాట్ ఉన్నదని, అది కొంచెం లిటికేషన్ లో ఉన్నదని అందుకు గాను 23 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వమని అడుగగా, విక్రమ్ రెడ్డి తండ్రి అయినా లింగా రెడ్డి కుటుంబం వారి వద్ద లేవు అని చెప్పడంతో, వెంటనే బాలరాజు మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మీ ఎక్స్ పార్టీ వారి వద్దకు వెళ్ళి వాళ్ల తరుపున మాట్లాడి మీ భూమి మీకు రాకుండా మీ అంతు చూస్తా అని బెదిరించడంతో భయపడిన వాళ్ళు బాలరాజుకు రూ.23 లక్షలు అప్పుగా తీసుకొచ్చి ఇచ్చారు. కొన్ని రోజులకు లింగా రెడ్డి, బాలరాజు ను అతను ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడగడంతో రేపు ఇస్తా, మాపు ఇస్తా అని కాలయాపన చేశాడు.
కానీ లింగా రెడ్డి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వదిలేలా లేరు అనుకోని ఎలాగైనా డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశ్యంతో, బాలరాజు చిన్నమ్మ కొడుకైన నిడమనూర్ మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన దుంప సాయి కృష్ణ, సాయి ఇద్దరు కలిసి పథకం ప్రకారం ఒక రోజు లింగా రెడ్డి, అతని కొడుకు విక్రమ్ రెడ్డిని పిలిపించి వారితో “నీ కొడుకు విక్రమ్ రెడ్డిని చంపడం కోసం మీ ఎక్స్ పార్టీ వాడైన సురేందర్ రెడ్డి నల్లగొండ కు చెందిన పెద్ద రౌడీ షీటర్ అయిన మెంటల్ రాజేశ్ అనే వ్యక్తికి రూ.40 లక్షలకు సుపారి ఇచ్చాడు” అని చెప్పి వారి ముందు, వారు నమ్మి భయపడాలనే ఉద్దేశ్యంతో బాలరాజు వాళ్ళ తమ్ముడైన సాయి కు ఫోన్ చేసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కాల్ లో “అన్నా విక్రమ్ రెడ్డిని చంపమని సుఫారి ఇచ్చింది ఎవరు అని అడుగగా! అతను సురేందర్ రెడ్డి అని చెప్పాడు”.
ఆ మాట విన్న లింగా రెడ్డి వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడి, అతనితో చంపకుండా ఉండటం కోసం ఎంత కావాలి అని అడుగగా! సురేందర్ రెడ్డి నాకు రూ.40 లక్షలు ఇచ్చాడు కాబట్టి, మిమ్మల్ని చంపకుండా ఉండటం కోసం ఇంకో రూ.20 లక్షలు అంటే మొత్తం 60 లక్షలు ఇస్తే వదిలేస్తా అని చెప్పడంతో, నిజంగానే చంపుతాడెమో అనే భయంతో వారికి ఉన్న భూమిలో 3 ఎకరాల నిమ్మతోటని అమ్మి బాలరాజు కు పలు ధపాలుగా మొత్తం రూ. 63 లక్షలు ఇచ్చాడు. కొద్ది రోజులకు మెంటల్ రాజేశ్ అనే వ్యక్తి జైలులో ఉన్నాడని తెలుసుకున్న లింగా రెడ్డి, బాలరాజు వద్దకు వెళ్ళి అతను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడగడంతో “మెంటల్ రాజేశ్ జైలుకు పోతే ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నారా? నాకు తెలిసిన రౌడీ పీటర్ లు చాలా మంది ఉన్నారు. అవసరం అయితే నేనే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరించాడు”.
దాంతో గత నాలుగు రోజుల క్రితం సామ లింగా రెడ్డి నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ముద్దం బాలరాజు తనను బెదిరించి, భయపెట్టి, మోసం చేసి డబ్బులు తీసుకున్న విషయం అంతా చెప్పి, అతని మీద కేసు పెట్టాడని తెలిసి భయం వేసి, ఇక్కడే ఉంటే పోలీస్ వాళ్ళు అతన్ని అరెస్టు చేస్తారేమో అని భయపడి కొద్ది రోజులు హైదరాబాద్ వెళ్ళాడు. ఎవరికి దొరకకుండా ఉందాం అని వెళుతుండగా నకిరేకల్ పోలీసులు వారి ఇద్దరినీ పట్టుకుని వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్ లు, మూడు కారులు స్వాదీన పరుచుకొని రిమాండ్ కు తరలించారు. గతంలో కూడా నిందితుడు ముద్దం బాలరాజు ఒక కేసులో జైలుకు వెళ్ళాడు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును చేధించిన నకిరేకల్ సి. ఐ. వెంకటేష్, ఎస్ ఐ వీరబాబు, యస్.ఐ. క్రిష్ణాచారి, సిబ్బంది సురేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, జనార్ధన్, వెంకటేశ్వర్లు, నాగార్జునలను జిల్లా ఎస్పీ అభినందించారు.
