ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

  • వరుసగా రెండో రోజు “ప్రజాదర్బార్”
  • ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్
  • అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు

అనంతపురం, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం రామ్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వరుసగా రెండో రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వివిధ ప్రాంతాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వ్యక్తిగత, స్థానిక, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై వారు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా పరిశీలించి, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ మంత్రి చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు అండగా నిలుస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి వినతిపై సంబంధిత శాఖల నుంచి చర్యలు తీసుకునేలా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.