సీక్రెట్‌ ఓటింగ్‌తో పబ్లిక్‌ క్లబ్‌ ఎన్నికలు నిర్వహించాలి

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని ఆర్డీవోకు వినతి

సూర్యాపేట, ఆంధ్రప్రభ: పబ్లిక్‌ క్లబ్‌ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్‌ బాక్సుల ద్వారా సీక్రెట్‌ ఓటింగ్‌తో నిర్వహించాలని కోరుతూ క్లబ్‌ సభ్యులు మంగళవారం స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, మాజీ కౌన్సిలర్లు గండూరి కృపాకర్‌, తాహెర్‌ పాషా, న్యాయవాదులు నాతి సవేందర్‌, గోండ్రాల అశోక్‌, నల్లకుంట్ల అయోధ్య మీడియాతో మాట్లాడుతూ.. క్లబ్‌ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరారు. క్లబ్‌ సభ్యుల్లో ఉద్యోగులు ఉన్నందున సెలవు రోజున ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

మరణించిన సభ్యుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి, ప్రస్తుతం ఉన్న సభ్యులందరితో కూడిన జాబితాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సభ్యుడికి ఫొటోతో కూడిన ఓటరు కార్డు అందించాలని, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణకు తగిన గడువు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు వెల్లడించాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పబ్లిక్‌ క్లబ్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.