ఏపీఎల్ లో తొలి విజయాల జోష్
ఏపీఎల్ లో తొలి విజయాల జోష్
విజయవాడ సన్ షైనర్స్ సూపర్ విక్టరీ
చివరి బంతికి తుంగభద్ర థ్రిల్లింగ్ గెలుపు..
ఉత్కంఠ భరితంగా ప్రతి మ్యాచ్..
ఆస్వాదిస్తున్న క్రీడాకారులు..
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్-5లో నాలుగో రోజు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత వినోదాన్ని అందించాయి. తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ షైనర్స్ సమష్టి ప్రదర్శనతో కాకినాడ కింగ్స్‌పై ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ చివరి బంతి వరకు సాగిన నరాలు తెగే పోరులో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్లు కూడా సీజన్‌లో తమ తొలి విజయాలను ఖాతాలో వేసుకోవడం విశేషం.
అభినవ్ మెరుపులు.. భరత్ బౌలింగ్ మాయాజాలం…
తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ సన్ షైనర్స్‌కు ఆరంభంలోనే అశ్విన్ వికెట్ కోల్పోవడంతో ఎదురుదెబ్బ తగిలినా, ఓపెనర్ ఎం. అభినవ్ దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. చివర్లో జహీర్ అబ్బాస్ 11 బంతుల్లో 25 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో విజయవాడ 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాకినాడ బౌలర్లలో గిరి ప్రసాద్ మూడు, ఆశిష్ రెండు వికెట్లు తీశారు.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్‌కు విజయవాడ బౌలర్లు ఆదిలోనే షాక్‌లు ఇచ్చారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలమవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. లెకాజ్ రెడ్డి 33 బంతుల్లో 62 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. తపస్వి 31 పరుగులతో కొంత ప్రతిఘటించినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. భరత్ మూడు వికెట్లు పడగొట్టగా, సిద్ధార్థ్, మోహన్, సుమిత్ తలో రెండు వికెట్లు తీసి కాకినాడను కట్టడి చేశారు. ఈ విజయంతో విజయవాడ సన్ షైనర్స్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అభినవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది.

చివరి బంతి వరకు ఉత్కంఠ… తుంగభద్ర సంచలన విజయం…
రోజులో రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తుంగభద్ర ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన రాయలసీమ జట్టు ధ్రువ కుమార్ రెడ్డి అర్ధశతకం, రషీద్ 41 పరుగులతో మంచి స్థితిలో కనిపించింది. అయితే చివర్లో తుంగభద్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాయలసీమ 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి చరణ్, దీపక్ స్టీఫెన్ తలో రెండు వికెట్లు సాధించి కీలక పాత్ర పోషించారు.
149 పరుగుల లక్ష్య ఛేదనలో తుంగభద్ర వారియర్స్‌కు కూడా ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. అయితే సూర్య జయంత్ (26), రోహిత్ (24) జట్టును పోటీలో నిలబెట్టారు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ కొనసాగగా, సౌరబ్ ఒత్తిడిని జయించి 15 బంతుల్లో 21 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి గెలుపు సాధించిన తుంగభద్ర వారియర్స్ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. సౌరబ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

థ్రిల్ అందిస్తున్న ప్రతి మ్యాచ్..
ఏపీఎల్-5లో నాలుగో రోజు జరిగిన ఈ రెండు మ్యాచ్‌లు ప్రేక్షకులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్‌ను అందించగా, విజయవాడ సన్ షైనర్స్ మరియు తుంగభద్ర వారియర్స్ జట్లు తొలి విజయాలతో టోర్నీలో తమ ఖాతాలను తెరిచాయి.
