ఓటు హక్కు ఎంతో అమూల్యమైనది
సిర్పూర్ (యు) (ఆంధ్రప్రభ): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి గ్రామ సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా అన్నారు. బుధవారం పంగిడి గ్రామ పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించి బీఎల్ఓకు అందజేశారు. అక్కడికక్కడే ఫారాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను పరిశీలించారు. పంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
