నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి – ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్లగొండ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. వేకువజామునే లేచి ఆయన పట్టణంలోని మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచి మాటా మంతీ గడిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగిరి సెంటర్ లో రోడ్డు పక్కన సువర్ణ అనే మహిళ బండి వద్ద కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి టిఫిన్ చేశారు. తనకు ఇల్లు లేదని, ఉన్న కొద్దిపాటి భూమిపై కిరికిరి ఉండడంతో అధికారులు న్యాయం చేయడం లేదని ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి అక్కడే ఉన్న ఎమ్మార్వోను పిలిచి సువర్ణ భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి శేషమ్మ గూడెం సమీపంలోని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు.
నెలరోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయాలి
నెలలోపు ఎస్టీపీ ని పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పట్టణంలో సుమారు 80 శాతం ఇండ్లు 20 ఏళ్ల కింద సీవరేజ్ ట్రీట్ మెంట్ కు అనుసంధానం చేశారని . మంత్రి చెప్పారు.2014లో రూ. 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర కాలనీ ,రాఘవేంద్ర కాలనీ అన్నింటికీ ఎస్టీపీ కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న 25 ,30 రోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయాలని మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆయన ఆదేశించారు. సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పూర్తి చేసి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. నర్సప్ప గూడ వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టీపీ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.ప్రజలు ఇబ్బందులు పడే పనిని తానెప్పుడు చేయబోనని చెప్పారు. జిల్లా కలెక్టర్ తో పాటు, ప్రత్యేక అధికారి స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఎస్టీపీ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంక,టేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబు అహ్మద్ పాల్గొన్నారు.