TG | ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా, పాకిస్తాన్ ల మధ్య పోటీ – బండి సంజయ్

.. ఇండియా గెలవాలనుకుంటే బిజెపికి ఓటు వేయండి
.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ – తెలంగాణలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య పోటీ జరగనుందని ఇండియా గెలవాలనుకుంటే బిజెపికి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు వేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని, మాది ఇండియా జట్టు ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టు అని తెలియజేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం, పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరగబోతోందని ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయాలన్నారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం అని తేల్చి చెప్పాయన్నారు. ఓటమి భయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కచ్చితంగా కనిపించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.


తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలు లో ఉన్నాయని, మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదన్నారు. కానీ 12.5 శాతం జనాభా ఉన్న ముస్లిం జనాభాలో 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటామన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా అని ప్రశ్నించారు. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలన్నారు.60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం ప్రభుత్వం చెప్పాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు.

Leave a Reply