TG | తెలంగాణ అభివృద్ధికి జర్మనీ బూస్ట్

TG | తెలంగాణ అభివృద్ధికి జర్మనీ బూస్ట్

  • నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందం

హైదరాబాద్: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ఊపునిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక (లైఫ్ సైన్సెస్) రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి, జర్మనీకి చెందిన థూరింగియా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

భారత్ పర్యటనలో భాగంగా జ‌ర్మ‌నీ థూరింగియా రాష్ట్ర మినిస్టర్-ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCR HRD) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఆవిష్కరణలలో తెలంగాణ అగ్రగామి…

భారతదేశంలో ఆవిష్కరణలు, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధికి తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని థూరింగియా మినిస్టర్-ప్రెసిడెంట్ మారియో ఫోకట్ కొనియాడారు. భారత్ – జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక, విద్యాసంస్థల భాగస్వామ్యంతో అవసరాల ఆధారిత నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను సంయుక్తంగా రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏఐ యుగానికి తగ్గట్టుగా స్కిల్లింగ్: సీఎం రేవంత్ రెడ్డి

ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ (Artificial Intelligence) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, మారుతున్న ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. “జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల అవసరాలను తీర్చే విధంగా మన స్కిల్లింగ్ కార్యక్రమాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది” అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), పాలిటెక్నిక్ విద్యాసంస్థల పాఠ్యాంశాలను ఆధునీకరించడంలో జర్మనీ సహకారాన్ని సీఎం కోరారు.

హైదరాబాద్‌లో ‘జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హబ్’

గ్లోబల్ టెక్నాలజీ హబ్‌లలో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ వంటి అంతర్జాతీయ కేంద్రాల్లో తెలంగాణ మానవ వనరుల పాత్రను సీఎం గుర్తుచేశారు. జర్మనీ పరిశ్రమలకు భవిష్యత్తులో అవసరమయ్యే మానవ వనరుల కోసం జర్మన్ వంటి విదేశీ భాషా శిక్షణను జోడించాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలో థూరింగియా రాష్ట్ర సహకారంతో హైదరాబాద్‌లో ఒక ‘జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హబ్’ (German Language Training Hub) ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ, విదేశీ ఉపాధి కల్పనలో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రతినిధి బృందానికి వివరించారు.

ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచ‌ర్ー సిటీ’ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు, ఫార్చూన్-500 కంపెనీలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ, గతంలో 100కు పైగా దేశాల ప్రతినిధులతో మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ట్రాక్ రికార్డ్ హైదరాబాద్‌కు ఉందని, ఇక్కడి మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అత్యంత అనుకూలమని స్పష్టం చేశారు.

త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు జర్మన్ సెమీకండక్టర్ల బృందం

ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు స్పందించిన మారియో ఫోకట్.. జర్మనీకి చెందిన ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీల ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని త్వరలోనే అధికారికంగా తెలంగాణకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్వాగతించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో జర్మనీ తరపున రాష్ట్ర కార్యదర్శులు ప్రొఫెసర్ టైకుర్ట్, షూకర్ట్, చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్‌తో పాటు ఆప్టిక్స్, ఫోటోనిక్స్, మెడ్‌టెక్, ఏరోస్పేస్ రంగాల పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply