- జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు 3520 అప్లికేషన్లు
- జిల్లాల్లో మరో 4 బార్లకు 148 మంది పోటీ.. 13న డ్రా
హైదరాబాద్, ఆంధ్రప్రభ :సుదీర్ఘకాలం తర్వాత బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఔత్సాహికులు పోటెత్తారు. బార్లను దక్కించుకునేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేశారు. జీహెచ్‌ఎంసిలోని 24 బార్లకు 3520 దరఖాస్తులురాగా, జిల్లాల్లోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి.
తాజాగా వచ్చి దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి. హరి కిరణ్ జీహెచ్‌ఎంసి పరిధిలో 24 బార్లకు, మిగిలిన జిల్లాల్లో నాలుగు బార్లకు దరఖాస్తులకు స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 28 బార్లకు 3668 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో బారుకు అత్యధికంగా 57 దరఖాస్తులురాగా, మహబూబ్‌నగర్‌లో 49, నిజామాబాద్‌లో 27, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 15 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్లు డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత నిబంధనలకు వీలుగా ఉన్న వాటిని తుది జాబితాలో చేర్చి వాటిని డ్రా తీయనున్నారు. ఈనెల 13న బార్లకు డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్‌లను ఎంపిక చేయడం జరుగుతుందని, డ్రా ఎక్కడెక్కడ అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ వెల్లడించారు.