పెట్రోల్ కొరత.. బంకుల వద్ద బారులు తీరిన రైతులు

పెట్రోల్ కొరత.. బంకుల వద్ద బారులు తీరిన రైతులు
పెట్రోల్ ట్యాంకర్ లారీ రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డ వినియోగదారులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం
నర్సింహులపేట, (ఆంధ్రప్రభ): యుద్ధ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన సరిపడా వ్యవస్థపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని హిందుస్థాన్ పెట్రోలియం బంకులో డీజిల్,పెట్రోల్ కొరకు వినియోగదారులు,రైతులు బారులు తీరారు.చుట్టుప్రక్కల ఏ బంకులో కూడా పెట్రోల్,డీజిల్ లేకపోవడంతో మండల కేంద్రానికి సోమవారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ లారీ రావడంతో జనం ఒకసారిగా ఎగబడ్డారు.రైతులు క్యాన్లతో వరుసలో నిలబడ్డారు.డీజిల్,పెట్రోల్ నిల్వలు తగ్గిపోవడంతో వ్యవసాయ పనులకు అవసరమైన డీజిల్ అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు,హార్వెస్టర్లు పొలాల్లోనే నిలిచిపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయి.కొందరు రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి డీజిల్ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.పరిస్థితిని అదుపులోకి తీసుకొని సరఫరా పెంచాలని రైతులు వాహనదారులు ప్రభుత్వాన్ని,సంబంధిత ఉన్నతాధికారులను కోరుతున్నారు.

