బ్యాగ్ లిఫ్టింగ్ ముఠా అరెస్ట్.. బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం

బ్యాగ్ లిఫ్టింగ్ ముఠా అరెస్ట్.. బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం

-హర్యానాకు చెందిన నలుగురు నిందితులు అదుపులో

-సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించిన పోలీసులు

కర్నూలు, ఆంధ్రప్రభ ప్రతినిధి:
అమాయక ప్రయాణికులకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి బ్యాగుల్లోని విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర బ్యాగ్ లిఫ్టింగ్ ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ సోమవారం వెల్లడించారు.

గత నెల 14న కర్నూలు నగరానికి చెందిన సావిత్రమ్మ, ఆమె కుమార్తె శ్రీలత హైదరాబాద్ వెళ్లేందుకు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి లగేజీని బస్సులో ఉంచారు. అనంతరం జిప్ సూట్‌కేస్‌ను తెరిచి అందులో ఉన్న సుమారు ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలను అపహరించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ పర్యవేక్షణలో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి అనుమానితులను గుర్తించారు.

విచారణలో హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్, సునీల్ కుమార్, రాజేష్, ప్రవీణ్‌లతో కూడిన బ్యాగ్ లిఫ్టింగ్ ముఠాగా తేలింది. ముఠా నాయకుడు సందీప్‌పై ఆదిలాబాద్, విజయవాడ, మహబూబ్‌నగర్, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో 30కి పైగా కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. మిగతా నిందితులపై కూడా పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు.

నిందితులను సోమవారం ఉదయం యుకాన్ ప్లాజా సమీపంలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విక్రమ్ సింహ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై గోపీనాథ్ యాదవ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply