నెట్నూర్‌లో ఈదురుగాలుల బీభత్సం

నెట్నూర్‌లో ఈదురుగాలుల బీభత్సం
- 30 ఇళ్ల రేకులు ధ్వంసం, అంధకారంలో గ్రామం
జైనూర్, ఆంధ్రప్రభ:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల పరిధిలోని నెట్నూర్ గ్రామపంచాయతీలో మంగళవారం సాయంత్రం అకాల ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా భారీ వేగంతో వీచిన గాలుల ధాటికి గ్రామంలోని దాదాపు 30 ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరి దూరంగా పడిపోయాయి. దీంతో ఆయా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమై లోపల ఉన్న గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యాయి. ఈదురుగాలుల తీవ్రతకు ఇళ్ల రేకులు ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడటంతో వైర్లు తెగిపోయి నెట్నూర్ గ్రామం పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది.
ప్రమాద తీవ్రతను తెలుసుకున్న నెట్నూర్ సర్పంచ్ మడావి లక్ష్మణ్ తక్షణమే స్పందించి గ్రామంలో పర్యటించారు. ఈదురుగాలుల వల్ల నష్టపోయిన ఇళ్లను, కూలిపోయిన రేకులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ గాలివాన బీభత్సానికి ఇళ్లతో పాటు స్థానిక హనుమాన్ మందిరం పైకప్పు రేకులు సైతం లేచిపోవడంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. హఠాత్తుగా వచ్చిన ఈ విపత్తు వల్ల నిలువ నీడ కోల్పోయిన గిరిజన కుటుంబాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తీవ్ర నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ మడావి లక్ష్మణ్ మాట్లాడుతూ.. అకాల ఈదురుగాలుల వల్ల పేద గిరిజనులకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు తోడు ఇప్పుడు ఇళ్ల కప్పులు లేకపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందించి, యుద్దప్రాతిపదికన ఆదుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
