ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు బాగుండాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు బాగుండాలి
- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సదుపాయాలు, మందుల లభ్యత తదితర అంశాల గురించి మండల వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటంరాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను విచారించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న ఉచిత వైద్య సేవలు, పౌష్టికాహారం, సిబ్బంది ప్రవర్తన తీరుపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
దామెర నూతన భవనం పనులు త్వరగా పూర్తి చేయాలి
దామెర గ్రామంలో నిర్మాణంలో ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన.. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. నూతన భవనాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్, ఆర్డీఓ వెలమ శేఖర్ రెడ్డి, డిప్యూటీలు డాక్టర్ లక్ష్మీపురం యశోద, డాక్టర్ సుమన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎంఆర్ఓ వీరాబాయి, దామెర గ్రామ సర్పంచ్ సాతిరి శ్రీధర్ రావు, ఉప సర్పంచ్ నర్సింహా, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
