మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ: పట్టణంలోని 9వ, 10వ, 12వ వార్డుల్లో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఉదయం 6 గంటల నుంచే ఆయా వార్డుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ముందుగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి, అనంతరం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ప్రజలకు నిత్యం అవసరమయ్యే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
