డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది: పీక వెంకన్న

చిట్యాల, ఆంధ్రప్రభ: డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది అని, చిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా సేవలందించారని చిట్యాల మండల బీజేపీ అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ అన్నారు.

సోమవారం మండలంలోని వనిపాకల గ్రామంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు పీక మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీక వెంకన్న, ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విభజన సమయంలో బెంగాల్ విభజన కోసం ఉద్యమించి, నేటి పశ్చిమ బెంగాల్ పాకిస్థాన్‌లో కలవకుండా కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘాన్ని స్థాపించి జాతీయవాద భావజాలాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో విలీనం కావాలని, ఆర్టికల్ 370 రద్దు చేయాలని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలంగా కోరారని చెప్పారు. “ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదు” అనే ఆయన నినాదం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివకోటి లింగయ్య, పీక మహేష్, సత్యనారాయణ, గూడపూరి యాదయ్య, ప్రవీణ్, సైదులు, మొదలవ్వ తదితరులు పాల్గొన్నారు.