Cloudburst Jammu Kashmir | బురదలో ట్రక్కులు, వాహనాలు
జమ్మూకాశ్మీర్‌లో మేఘ విస్ఫోటనం బీభత్సం..
జలవిద్యుత్ ప్రాజెక్టును ముంచెత్తిన వరద
కిష్త్వార్‌లో భారీ వర్షాలతో క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద శిథిలాల ప్రవాహం
దోడా జిల్లాలో కొండచరియలు విరిగి జమ్మూ–కిష్త్వార్ జాతీయ రహదారి మూసివేత.. సహాయక చర్యలు ముమ్మరం
Cloudburst Jammu Kashmir | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జమ్మూ–కాశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కిష్త్వార్, దోడా జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేసి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
కిష్త్వార్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా బురద, రాళ్లు, శిథిలాలు ప్రాజెక్టు ప్రాంగణంలోకి దూసుకువచ్చాయి. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసి ఉన్న అనేక వాహనాలు బురద, రాళ్ల కింద చిక్కుకున్నాయి. ప్రాజెక్టు ప్రాంగణానికి గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
మరోవైపు దోడా జిల్లాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాలు జమ్మూ–కిష్త్వార్ ప్రధాన రహదారిపై పడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు, రహదారుల శాఖ సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి వీలైనంత త్వరగా రహదారిని పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాలకు ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.
