పాము కాటుతో రైతు మృతి..
- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
వేములవాడ, ఆంధ్రప్రభ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపురం గ్రామానికి చెందిన రైతు ఎల రాజయ్య (65) పాము కాటుకు గురై సోమ వారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాజయ్య తన సొంత వ్యవసాయ భూమిలో వద్ద గడ్డి తొలగిస్తుండగా అకస్మాత్తుగా పాము కాటు వేసింది.
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే విషం శరీరమంతా వ్యాపించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య పోషవ్వ, కుమారులు ఎల రాజు, ఎల శ్రీనివాస్, కుమార్తె లత ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎల శ్రీనివాస్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
కౌన్సిలర్ ఎల శ్రీనివాస్‌కు పితృవియోగం సంభవించిన విషయం తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వైస్ చైర్మన్ నరాల శేఖర్ లతోపాటు పాలకమండలి సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది,పుర ప్రముఖులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, దళిత సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాజయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ తన సంతాపాన్ని తెలిపారు.
