విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చైర్‌పర్సన్..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి నాగమణి స్వామి పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభ్యాసానికి శుభారంభం పలికారు.

అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన (ఎండీఎం) పథకాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంట విధానంపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేసి, వారికి అందుతున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనంతరావు, పాఠశాల విద్యా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ, ఉపాధ్యక్షులు రఘు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.