వరి ధాన్యం తూకంలో దోపిడీని అరికట్టాలి

వరి ధాన్యం తూకంలో దోపిడీని అరికట్టాలి
చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా..
ఒకే లారీలో 3 క్వింటాళ్ల 70 కిలోల తూకం తేడా !
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు తూకంలో జరుగుతున్న దోపిడీని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ… రైతులు అష్టకష్టాలు పడి, చెమటోడ్చి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే తూకం వేసేటప్పుడు దారుణంగా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రైతులు ధాన్యం జోకే కాంటాలను స్వయంగా పట్టుకుని నిలదీయగా, కేవలం ఒక్క లారీలోనే ఏకంగా 3 క్వింటాళ్ల 70 కిలోల ధాన్యం తూకంలో తేడా వచ్చినట్లు బహిర్గతమైందని ఆయన వెల్లడించారు. రైతుల నిరసనతో రంగంలోకి దిగిన తాహసిల్దార్ వీరాబాయి , ఇతర ప్రభుత్వ అధికారులు తూకంలో జరిగిన తేడాను పరిశీలించి, తక్షణమే వాటిని సరిచేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా, ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అధికారులు తీవ్ర అశ్రద్ధ వహిస్తున్నారని కృష్ణారెడ్డి విమర్శించారు. ఏ సమయంలో అకాల వర్షాలు వస్తాయో తెలియక రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రాత్రి పగలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లతో తగిన సమన్వయం చేసుకుని ధాన్యాన్ని త్వరగా తరలించేలా ఏర్పాట్లు చేయాలని, తూకంలో ఎటువంటి తేడాలు వచ్చినా బాధ్యులైన అధికారులపై, సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చీర్క అలివేలు, బోరం నర్సిరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, గోశిక కరుణాకర్, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
