ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు..
వీబీజీ–రామ్జీ పథకంతో గ్రామీణ కుటుంబాలకు మరింత భరోసా
15 రోజుల్లోనే వేతనాలు ఖాతాల్లో జమ..
సాంకేతికతతో పారదర్శకత పెరుగుతుంది : ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలకు మరింత మేలు చేకూర్చేలా ‘వికసిత్ భారత్–జీ రామ్జీ’ (వీబీజీ–రామ్జీ) పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కల్పించే పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.
ఆమదాలవలస మండలం సైలాడ గ్రామంలో గురువారం నిర్వహించిన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా గ్రామీణుల జీవితాల్లో భాగమైన ఉపాధి హామీ పథకం ఇకపై కొత్త రూపంలో అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులను ఈ నూతన పథకానికి అనుసంధానిస్తామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పని చేసిన కూలీలకు 15 రోజుల్లోనే వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సాంకేతిక కారణాలతో వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే కూలీలకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పారు.
గతంలో ఉపాధి పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ సంస్కరణలతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరుగుతుందన్నారు.
వీబీజీ–రామ్జీ పథకం కింద చెరువుల పూడికతీత, పంట కాలువల పునరుద్ధరణ, భూమి అభివృద్ధి పనులు, ఫార్మ్ పాండ్స్, భూగర్భ జలాల రీఛార్జ్ పనులు వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉదయ్ కుమార్, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
