అగ్నిప్రమాద బాధితులకు ఆర్.ఆర్ ఫౌండేషన్ అండ..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని వెంకటరామిరెడ్డి కాలనీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఒక పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కాలనీకి చెందిన కడమంచి లక్ష్మణ్ – రేణుక దంపతుల గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో, వారికున్న సర్వస్వం మంటల్లో దగ్ధమయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిన ఆ కుటుంబం నిరాశ్రయులై దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఆర్.ఆర్ (RR) ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ మానవత్వంతో స్పందించారు.

బాధితుల దయనీయ స్థితిని తెలుసుకున్న రాఘవేంద్ర గౌడ్ గురువారం వారిని స్వయంగా పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఆయన, తక్షణ సాయం కింద ₹10,000 (పది వేల రూపాయలు) నగదును, కొత్త గుడిసె ఏర్పాటు కోసం అందజేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి అవసరమైన నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. కేవలం వ్యక్తిగత సాయమే కాకుండా, ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం కూడా త్వరితగతిన అందేలా అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఆర్.ఆర్ ఫౌండేషన్ అధినేతకు బాధితులు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు

Leave a Reply