ప్రాజెక్టుల అనుమతుల రద్దు కుట్రను అడ్డుకోవాలి..
- జీఆర్ ఎంబీ ఎజెండా నుంచి అంశాన్ని తక్షణమే తొలగించాలి..
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు సంబంధించిన అంశాన్ని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీ ఏం ఆర్ బీ ) సమావేశం ఎజెండా నుంచి వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనున్న జీ ఏం ఆర్ బీ 18వ సమావేశం నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడం, ఆ అంశాన్ని జీ ఏం ఆర్ బీ సమావేశం ఎజెండాలో చేర్చడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని వినోద్‌కుమార్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు సాధించిన చట్టబద్ధమైన అనుమతులను రద్దు చేయాలనే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దయితే తెలంగాణ రైతాంగం, సాగునీటి రంగం, రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలందరూ వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని జీ ఏం ఆర్ బీ ఎజెండా నుంచి తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వినోద్‌కుమార్ కోరారు.
పార్లమెంట్ వేదికగా కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలని సూచించారు. జీ ఏం ఆర్ బీ సమావేశాన్ని బీఆర్‌ఎస్ బహిష్కరించాలని కోరుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వినోద్‌కుమార్ విమర్శించారు. సమావేశాన్ని బహిష్కరించాలన్నది తమ పార్టీ డిమాండ్ కాదని, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ఎజెండా నుంచి తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాన్ని పక్కదారి పట్టించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాంచందర్ రావును కోరారు.
ప్రాజెక్టుల అనుమతులు రద్దయితే రాష్ట్రంలో తీవ్ర విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీలోగా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల పునఃపరిశీలన, రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవడంతో పాటు, రద్దు అంశాన్ని జీ ఏం ఆర్ బీ సమావేశం ఎజెండా నుంచి తక్షణమే తొలగించాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ రాష్ట్ర చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ నర్సింహులు, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, కిషన్, జక్కుల నాగరాజు, మురళిలు పాల్గొన్నారు.
