అటవీశాఖ దాడులు ఆపాలి..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారుల దాడులు, వేధింపులు ఆపాలని ఎమ్మార్పీఎస్ టేకుమట్ల మండల ఇంచార్జి రేణుకుంట్ల సంపత్ మాదిగ డిమాండ్ చేశారు. రాఘవాపూర్‌కు చెందిన 10 మంది దళిత రైతులు చైన్‌పాక శివారులోని భూములను 20 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల వారు సాగు చేసిన పత్తి పంటను అటవీ అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అటవీశాఖ అధికారులు స్పందించి రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రేణుకుంట్ల శంకర్, అక్కల రాజయ్య, అక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.