త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడిన విజయవాడ

  • ‘హర్‌ ఘర్‌ తిరంగ’లో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ
  • ‘భారత్‌ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో మార్మోగిన బందరు రోడ్డు
  • కలెక్టరేట్‌ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు భారీ ర్యాలీ
  • విద్యార్థులు, యువత, క్రీడాకారులు, అధికారులు, పోలీసులు, ప్రజల ఉత్సాహభరిత భాగస్వామ్యం

విజయవాడ, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో విజయవాడలో గురువారం దేశభక్తి వెల్లువెత్తింది. ‘హర్‌ ఘర్‌ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ త్రివర్ణ పతాకాల రెపరెపలతో, దేశభక్తి నినాదాలతో నగరాన్ని శోభాయమానం చేసింది. కలెక్టరేట్‌ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, యువత, క్రీడాకారులు, అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు.

జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీ కలెక్టరేట్‌ వద్ద ప్రారంభమై ప్రధాన రహదారుల మీదుగా బందరు రోడ్డుపై కొనసాగింది. చేతుల్లో జాతీయ పతాకాలు.. హృదయాల్లో దేశభక్తి నింపుకున్న యువత, విద్యార్థుల ఉత్సాహంతో ర్యాలీ ఆద్యంతం సందడిగా సాగింది. ‘భారత్‌ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో బందరు రోడ్డు మార్మోగింది. రహదారికి ఇరువైపులా త్రివర్ణ పతాకాల సందడి కనిపించడంతో విజయవాడ జిల్లా కేంద్రం దేశభక్తి రంగుల్లో మునిగిపోయింది.

దేశభక్తి.. జాతీయ సమైక్యతకు ప్రతీక..

జాతీయ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం, అమరవీరుల త్యాగం, జాతీయ ఐక్యత, దేశ గౌరవానికి ప్రతీక అని కార్యక్రమంలో అధికారులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, బాధ్యతాయుత పౌరసత్వ భావనలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత దేశభక్తి నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలనే సందేశాన్ని ర్యాలీ చాటింది.

21 ఏళ్ల భవిష్యత్తుకు లక్ష్యాలు పెట్టుకోవాలి..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘దేశ నిర్మాణంలో భాగస్వాములు’ అనే స్ఫూర్తితో అన్ని రంగాల ప్రజలను జాతీయ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాబోయే 21 సంవత్సరాల్లో తమ గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే దానిపై ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘వందేమాతరం–వందే భారతం’, ‘మేము భారతం కోసం’, ‘మేము ఆంధ్రప్రదేశ్‌ కోసం’, ‘మేము ఎన్టీఆర్‌ జిల్లా కోసం’ అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. భారత రాజ్యాంగం అందించిన విలువలు, స్ఫూర్తిని గుర్తుచేసుకోవడం కూడా తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు. ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తించి దేశ అభివృద్ధి, సమాజ ప్రగతిలో భాగస్వామి కావాలని కోరారు.

2047 స్వర్ణాంధ్రే లక్ష్యం..

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల కర్తవ్య భావనతో ముందుకు సాగినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ర్యాలీ ప్రశాంతంగా, క్రమశిక్షణతో విజయవంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రతి ఇంటికీ తిరంగ స్ఫూర్తి..

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌.ఎం. ధ్యాన్‌చంద్ర మాట్లాడుతూ ‘హర్‌ ఘర్‌ తిరంగ’ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ, ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లేలా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, జాతీయ పతాకం ప్రాధాన్యతను ముఖ్యంగా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

జాతీయ పతాకం పట్ల గౌరవం, దేశం పట్ల బాధ్యత, జాతీయ సమైక్యతా భావం ప్రతి పౌరుడిలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవాడ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దేశభక్తి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.