గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు..

  • మెదరిపేట–మామిడిపల్లి రహదారిపై సేవాభావం

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలోని, మెదరిపేట నుంచి మామిడిపల్లి వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.దీంతో సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గుంతల్లో మట్టి, కంకర వేసి వాటిని పూడ్చి రాకపోకలకు కొంతమేర ఇబ్బందులు తగ్గించారు. ప్రజల కోసం తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు.

ప్రతిరోజూ ఈ మార్గంలో అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతల కారణంగా ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రహదారిని పరిశీలించి, గుంతలను పూర్తిస్థాయిలో పూడ్చడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి స్వచ్ఛందంగా గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లను స్థానికులు అభినందించారు.