జనాభా లెక్కలతో పాటే కుల గణన చేపట్టాలి..

జనాభా లెక్కలతో పాటే కుల గణన చేపట్టాలి..

గన్‌పార్క్‌ ధర్నాను జయప్రదం చేయండి
నల్లబెల్లి మండల బీసీ హక్కుల సాధన సమితి కార్యదర్శి చీకటి ప్రకాష్ పిలుపు

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టబోయే జనాభా లెక్కలతో పాటే కుల గణనను కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష బీసీ సంఘాల నిరసన ధర్నాను జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి నల్లబెల్లి మండల కార్యదర్శి చీకటి ప్రకాష్ కోరారు. మండల కేంద్రమైన నల్లబెల్లిలో కడియాల క్రాంతి కుమార్,కొనకటి రమేష్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.పార్లమెంటు సాక్షిగా గతంలో కేంద్ర మంత్రులు, మోడీ ప్రభుత్వం బీసీ కులాల జనాభా లెక్కలు తీస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం జనాభా లెక్కలు మాత్రమే తీసే విధంగా సర్వే ఫారమ్ సిద్ధం చేయడం బీసీలను వంచించడమేనని విమర్శించారు.బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు అడగని అగ్రవర్ణాలకు ఎటువంటి లెక్కలు తీయకుండానే 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన మోడీ ప్రభుత్వం, మెజారిటీగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నించారు.నిత్యం హిందువులంతా ఒక్కటే అని చెప్పే బీజేపీ, 60 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. బీసీలను అన్ని రంగాల్లో అణిచివేస్తున్న ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గన్‌పార్క్‌ వద్ద జరిగే నిరసన ధర్నాకు బీసీలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply