రూ.400 కోట్ల బకాయిల కోసం సమ్మెబాట..
- నగర పనులకు తాత్కాలిక బ్రేక్
- 16 నెలలుగా బిల్లులు పెండింగ్..
- అప్పులు చేసి పనులు చేశామంటున్న కాంట్రాక్టర్లు
- రోడ్లు, డ్రైన్లు, కాలువలు, నీటి పైపులైన్ల పనులపై ప్రభావం
- అత్యవసర సేవలకు మినహాయింపు.
- నిలిచిన మిగిలిన పనులు
- మాటలు కాదు.. నిధుల విడుదలకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్న కాంట్రాక్టర్లు
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ) : నగర అభివృద్ధి పనులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) తమకు చెల్లించాల్సిన సుమారు రూ.400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పట్టారు. 16 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి పనులు కొనసాగించాల్సి వచ్చిందని, వడ్డీల భారం పెరిగి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా కొత్త పనులకు టెండర్లు పిలవడం వల్ల తమపై మరింత భారం పడుతోందని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల సమ్మెతో అత్యవసర పనులు మినహా మిగిలిన నిర్మాణ, నిర్వహణ పనులకు బ్రేక్ పడింది.
సమ్మెతో తీవ్ర ప్రభావం…

వీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్ల పాత్ర విస్తృతంగా ఉంది. నగర రహదారుల నిర్మాణం, మరమ్మతులు, వంతెనల పనులు, కాలువలు, డ్రైన్ల నిర్మాణం, డ్రైనేజీ పైపులైన్లు, తాగునీటి సరఫరా లైన్లు, వాహన డిపోలు, పార్కుల అభివృద్ధి తదితర అనేక పనులు కాంట్రాక్టర్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే కొత్త అభివృద్ధి పనులు ఆలస్యం కావడంతో పాటు రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ నిర్వహణ, కాలువల పనులు, ఇతర మౌలిక వసతుల పనులపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో డ్రైన్లు, కాలువల నిర్వహణ పనులు ఆలస్యం అయితే నీరు నిలిచిపోవడం, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం వంటి పరిణామాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.
మా డబ్బులు మాకు ఇవ్వండి..
‘మా డబ్బుతోనే పనులు చేశాం’ అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఎంసీ నుంచి బిల్లులు సకాలంలో రాకపోయినా పనులు నిలిపివేయకుండా కొనసాగించామని, ఇందుకోసం బయట నుంచి అప్పులు తెచ్చి, వడ్డీలు చెల్లిస్తూ పనులు పూర్తి చేశామని చెబుతున్నారు. ఇప్పుడు బకాయిలు పేరుకుపోవడంతో కొత్త పనులకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఎంసీకి రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వీఎంసీని ఆదుకుంటేనే తమ బకాయిల సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేస్తున్నారు.
చర్చలకు పిలిచిన అధికారులు..

కాంట్రాక్టర్ల ఆందోళన నేపథ్యంలో వీఎంసీ అధికారులు వారిని చర్చలకు పిలిచారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు, పనులను కొనసాగించేందుకు సహకరించాలని అధికారులు కోరినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన సేవలకు మినహాయింపు ఇవ్వడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే బిల్లుల చెల్లింపుపై కేవలం హామీలు, చర్చలతో సమస్య పరిష్కారం కాదని, ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు? ఎంత మొత్తం చెల్లిస్తారు? అనే దానిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం అత్యవసర పనులను మినహాయించి మిగిలిన పనులను నిలిపివేసిన కాంట్రాక్టర్లు తమ డిమాండ్లపై ప్రభుత్వం, వీఎంసీ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నామని, స్పందన లేకుంటే వీఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధించే స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కాంట్రాక్టర్లను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.
