భక్తుల రద్దీకి సిద్ధమవుతున్న ఆలయం..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని లింగాల్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనుక ఉన్న శనీశ్వర ఆలయంలో శనిత్రయోదశి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని వారు కోరారు. శనిత్రయోదశి రోజున శనీశ్వరుని ఆరాధించడం ద్వారా శని దోషాల ప్రభావం తగ్గుతుందని భక్తుల విశ్వాసమన్నారు.
ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగడం, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలగడం వంటి శుభఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. కుటుంబంలో శాంతి, సౌఖ్యం పెరగడంతో పాటు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
ఈ పవిత్ర రోజున శని దేవాలయాన్ని దర్శించుకోవడం, నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, “ఓం శం శనైశ్చరాయ నమః” లేదా శని గాయత్రి మంత్రాన్ని జపించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నట్లు చెప్పారు.
అలాగే పేదలకు, అవసరమైన వారికి దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వంటి సత్కార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని తెలిపారు. భక్తి, నిజాయితీ, సత్కార్యాలతో జీవించడం ద్వారానే శనీశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
