27thMayeditorial | తెలుగు భాష, సంస్కృతికి ఎన్టీఆర్ చేసిన సేవలు

27thMayeditorial | తెలుగు భాష, సంస్కృతికి ఎన్టీఆర్ చేసిన సేవలు

27thMayeditorial | ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం.. తెలుగు జాతిలో సంచలనం
సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానం
తెలుగు భాష, సంస్కృతికి ఎన్టీఆర్ చేసిన సేవలు

27thMayeditorial | తెలుగువారికి నేడు, రేపు పసుపు పండుగలు. ఏ పండుగకైనా గుమ్మాలకు పసుపు రాసి ముగ్గులు పెట్టడం శుభప్రదంగా భావిస్తారు తెలుగువారు. తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడుగా మూడున్నర దశాబ్దాలుగా తెలుగువారు జరుపుకుంటున్నారు.

ఎందుకింత ప్రత్యేకత అంటే, ప్రజల జీవితాల్లో, ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకువచ్చిన అలనాటి అందాల నటుడు దశాబ్దాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి పార్టీని నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆయనను కేవలం సినీనటునిగా జనం ఆదరించలేదు. ఆయన రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ జనం ఆయన మాటను నమ్మారు. ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని అనుకున్నారు.

ఎన్టీఆర్ పేరు చెబితే ఓట్లు రాలే పరిస్థితి ఆనాడు ఉండేది. అభ్యర్థులు ఎవరో తెలియకపోయినా, ఎన్టీఆర్ ఫోటో చూసి జనం ఓట్లు వేశారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ అందరిలాంటి వాడే అయినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల అంత గొప్పవాడయ్యాడు. పేదల కన్నీళ్లను, కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన ఎన్టీఆర్ పేదలకు ఒక పూటైనా పట్టెడన్నం దొరికేలా చేయడం కోసం రెండు రూపాయిలకు కిలో బియ్యం అందించే సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తలదాచుకోవడానికి లక్షలాది ఇళ్లను నిర్మిస్తామని వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకున్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రజలు నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ పథకాలను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలనే ప్రవేశపెట్టారు. ఇప్పటికీ అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నినాదం “ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం”. కేవలం నినాదంతో సరిపెట్టకుండా దానిని అక్షరసాక్షిగా అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్. ప్రజలను జాగృతం చేసిన నాయకుడు ఆయన. ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఇప్పటికీ కొలువై ఉన్నారు.

సంక్షేమ పథకాలకు చిరునామాగా నిలిచిన ఆయన అమలు చేసినన్ని సంక్షేమ పథకాలను మరే నాయకుడూ అమలు చేయలేదంటే అతిశయోక్తి కాదు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారు స్వశక్తిపై నిలిచేలా చేశారు. చలనచిత్ర రంగంలో రాముడు, కృష్ణుడు వంటి దైవాంశ పాత్రలను పోషించిన ఎన్టీఆర్‌ను నిజజీవితంలో కూడా ఆయా పాత్రల్లో తలచుకుని ఆరాధించేవారు ఈనాటికీ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలదన్నే రీతిలో ఆయన జనాకర్షణ పొందారు. తెలుగు భాషకు, ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చారు.

అంతకుముందు ఢిల్లీలోనూ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తెలుగువారిని “మదరాసీలు” అని పిలిచేవారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ఆయన అంటుంటే సాక్షాత్తు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు జనం మనోఫలకంపై నిలిచినట్టుండేది. ఆయన ఎన్నిగంటలు మాట్లాడినా ఒక్క ఆంగ్లపదం లేకుండా పూర్తిగా తెలుగులోనే ప్రసంగించేవారు. తెలుగంటే ఆయనకు అంత మమకారం.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై తెలుగు కవులు, చారిత్రక పురుషుల విగ్రహాలను “తెలుగువెలుగులు” పేరిట ప్రతిష్ఠింపజేశారు. సినారె చేత “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” వంటి గీతాలతో పాటు తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టించారు. కేంద్రాన్ని “మిధ్య” అని సంబోధించిన ఏకైక నాయకుడు ఆయన. “ఢిల్లీకి కప్పాలు కడితేనే అనుమతులు ఇస్తారా?” అంటూ హూంకరించేవారు. తెలుగు భాషకూ, కవులకూ, నాయకులకూ అవమానం జరిగితే సహించేవారు కాదు. తెలుగు విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించి సమాజంలో వారికి గౌరవస్థానం కల్పించారు.

అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని నేటి పాలకుల మాదిరిగా ఊరించడం కాకుండా అక్షరం పొల్లు పోకుండా అమలు చేసి చూపించారు. తెలుగులోనే శాసనాలు జారీ చేయించిన ఘనుడు ఆయనే. ఇప్పుడు తెలుగులోనే తీర్పులు రావడానికి పునాది వేసింది కూడా ఆయనే.

ఎన్టీఆర్‌ను కేవలం సినిమా మోజు వల్ల కాకుండా, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేసిన కార్యక్రమాల ద్వారానే ప్రజలు ఈనాటికీ ఆరాధిస్తున్నారు. సినీనటులు రాజకీయాల్లో రాణించలేరని ఎద్దేవా చేసిన వారికి చేసి చూపించిన గొప్ప సామాజిక హితకారుణ్యమూర్తి ఎన్టీఆర్. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు విజయ్ కూడా ఆయన అడుగుజాడల్లోనే ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ఆయన కృషి చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇంతకాలం నిలిచి ప్రజల ఆదరణను చూరగొంటోందంటే అందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణం. ఆనాటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చినప్పటికీ చంద్రబాబు తెలుగు జాతిని ఏకతాటిపై నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఐటీ రంగానికి చిరునామాగా చేసిన చంద్రబాబు, ఇప్పుడు కృత్రిమ మేధకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కొత్తగా ఏ ప్రాజెక్టు వచ్చినా దానిని అమరావతికి తీసుకురావడానికి పట్టుదలతో పనిచేస్తున్నారు.

ఆయన కుమారుడు లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లో అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ కన్న కలలను ఈడేర్చేందుకు తండ్రి, తనయులు చేస్తున్న కృషి తెలుగుజాతిని అజరామరం చేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

బి.పి

Leave a Reply