Nandyala | వెరీ పూర్..!

Nandyala | వెరీ పూర్..!
- రాయలసీమ ప్రాజెక్టులు అధ్వానం
- ప్రాజెక్టులకు నీరు మాటల్లోనే…
- పాలకుల ప్రకటనలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదు
- రాయలసీమ ప్రజల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
- రైతు కూలీ సంఘం రాష్ట్ర అద్యక్ష్యురాలు ఝాన్సీ
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని, పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలోనూ వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదని, రాయలసీమ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, రాష్ట్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ పేర్కొన్నారు. ఈ రోజు సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో సమితి బృందం సభ్యులు వెలుగోడు రిజర్వాయర్, మద్రాసు కాలువ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, ఎస్సార్‌బీసీ కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టులు, కాలువల గురించి క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి వివరించారు. పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా నంద్యాల, కడప జిల్లాల్లో సుమారు 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.. అలాగే మద్రాసు నగరానికి తాగునీరు సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, నేటికీ ఈ ప్రాజెక్టు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ఉండే సుమారు 30 రోజుల వ్యవధిలో వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్‌కు నీటిని తరలించేందుకు అవసరమైన కాలువ సామర్థ్యం లేకపోవడం, అలాగే తెలుగుగంగ ఆయకట్టుకు పంటకాలంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా నీరు అందని దుస్థితి నెలకొందన్నారు.
ముఖ్యమంత్రిగా అంజయ్య చేపట్టిన ఎస్సార్‌బీసీ కాలువ ద్వారా బనకచర్ల నుండి గోరుకల్లు రిజర్వాయర్‌కు నీటిని తరలించి, అక్కడి నుండి గాలేరు–నగరి, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ ప్రాంతాలకు నీరు అందించాల్సి ఉండగా, కాలువను 22 వెల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఉన్న అడ్డంకుల కారణంగా 8 వెల క్యూసెక్కుల నీరు కూడా పూర్తిగా తరలించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కాలువ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు కేవలం 19 చోట్ల కేసీ కెనాల్‌ను ఎస్సార్‌బీసీ కాలువపై దాటించే ఆక్వడక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, వాటిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అందవలసిన ఆయకట్టుకు నీరు అందలేదన్నారు.
150 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. అలాగే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి 30 రోజుల్లో రాయలసీమకు 120 టీఎంసీల నీటిని తరలించాల్సిన నిర్మాణాలు పూర్తయినప్పటికీ, అక్కడి నుండి రాయలసీమకు నీటిని తరలించేందుకు అవసరమైన తదుపరి పనులను పాలకులు చేపట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నరు.20 కోట్ల రూపాయల కేటాయించి శ్రీశైలం రిజర్వాయర్ నుండి 30 రోజులలో నీటిని తీసుకొని గోరకల్లు, ఆవుకు, గండికోట, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ లను నింపడానికి కీలకమైన ఎస్ ఆర్ బి సి కాలువలోని అడ్డంకులు తొలగించడానికి 20 కోట్ల రైపాయలను తక్షణమే కేటాయించి ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సందర్శనలో సమితి కార్యవర్గ సభ్యులు, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు గంగ ఆయకట్టు రైతులు, కరిమెద్దల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు, మహానంది రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఆర్బీసీ కాలువ బాధితులు, నందిరైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
