సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుదాం..
- యాదాద్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు.
జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి, ఆర్డీవో మాలికృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
