త్యాగధనుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా వాయువు
జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు (ఆంధ్రప్రభ): ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల స్ఫూర్తితో సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బడేటి చంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ఎన్నో పోరాటాలు సాగించి, అనేక త్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఘన చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగ స్ఫూర్తితో ప్రజలంతా సమాజ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, డివిజన్ ఇన్‌చార్జిలు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
