సమరయోధుల త్యాగాలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకం
ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విజయవాడ (ఆంధ్రప్రభ): విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, జాతీయ ఐక్యతను కాపాడాలని, భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు జాతీయ పతాకాలను చేతబూని ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ సాగిన ర్యాలీలో ‘జై హింద్.. జై భారత్’ నినాదాలు మార్మోగాయి. జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
