ప్రభుత్వ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు సీజ్
ఐదుసార్లు నోటీసులిచ్చినా స్పందన కరువు..
భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్యలు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. టెండర్ గడువు ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో షట్టర్లను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దుకాణదారులకు ఐదుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలను టెండర్ విధానంలో కేటాయించారు. గడువు పూర్తయిన తర్వాత ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ పలువురు దుకాణదారులు స్పందించలేదు. దీంతో అధికారులు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సీజ్ ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సీజ్ అనంతరం దుకాణాల నిర్వహణపై అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
