అమరవీరుల సాక్షిగా రాష్ట్ర ప్రగతి ప్రస్తావన..

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, పోలీసు అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని పూలమాలలు వేసి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జి. చిన్నారెడ్డి ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అవతరణకు ముందు ఉన్న పరిస్థితులు, అనంతరం విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణతో అన్ని రంగాల్లో అభివృద్ధి వేగవంతమైందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన జి. చిన్నారెడ్డి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివిధ రంగాల్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
