TDP | సామాజిక న్యాయానికి అగ్ర పీట..

TDP | సామాజిక న్యాయానికి అగ్ర పీట..
- టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
TDP | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ నియామకాలలో సామాజిక న్యాయానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించి పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువతకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తూ వస్తోందని ఆయన గుర్తు చేశారు. తాజా నియామకాలలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందన్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష స్థానాలలో బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనారిటీలకు 1 స్థానం కేటాయించడం ద్వారా మెజార్టీ స్థానాలను బడుగు వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి అగ్రస్థానం కల్పించారని వివరించారు.
అదే విధంగా మహిళలకు కూడా తగిన స్థానం కల్పించి మహిళా సాధికారతకు పార్టీ స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని అన్నారు. యువతకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్తు రాజకీయ నాయకత్వానికి బీజం వేయడం జరిగిందని తెలిపారు. ఈ నియామకాలు పార్టీ జాతీయ అధ్యక్షుల సామాజిక ఇంజనీరింగ్ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తున్నాయని వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాస రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతనంగా నియమితులైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులందరికీ అభినందనలు తెలియజేశారు. సామాజిక సమతా, సమాన అవకాశాలు, అన్ని వర్గాల భాగస్వామ్యమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని, ఈ నియామకాలుそのదానికి నిదర్శనమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ స్పష్టం చేశారు.
