Talasani Srinivas Yadav | సీఎంపై తలసాని ఫైర్.. “కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం ఎవరి తరం?”

Talasani Srinivas Yadav | సీఎంపై తలసాని ఫైర్.. “కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం ఎవరి తరం?”

హామీలు అమలు చేయలేక బూతు భాష మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్‌పై తలసాని తీవ్ర విమర్శలు

Talasani Srinivas Yadav | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: పరిపాలన చేతకాకే రాష్ట్ర ముఖ్యమంత్రి బూతు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్‌లోని బీకే గూడ పార్క్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే “పండబెట్టి తొక్కుతా”, “పేగులు మెడలో వేసుకుంటా” అంటూ ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఇలాంటి భాష మాట్లాడే ముఖ్యమంత్రిని తాను చూడలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవికి ఎంతో గౌరవం ఉందని, ఆ స్థాన విలువను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తలసాని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని వివరించారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలిపిన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అంటున్న ముఖ్యమంత్రి, తాను ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

అద్భుతంగా నిర్మించిన సచివాలయం, పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను తొలగిస్తారా? లేక యాదాద్రి దేవస్థానాన్ని, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేస్తారా? అని తలసాని ప్రశ్నించారు. చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

కాయకష్టం చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని, కనీసం గోనె సంచులు కూడా అందించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. “మీ పార్టీని ప్రజలే పండబెట్టి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని తలసాని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, రమేష్ గౌడ్, కొలను భూపాల్ రెడ్డి, ఆకుల రాజు, పీయూష్ గుప్తా, షాబాద్ శ్రీనివాస్, గౌతమ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply