T20 Cricket | 20న జట్టు ప్రకటన..

T20 Cricket | 20న జట్టు ప్రకటన..
- మెగా టోర్నీకి భారత జట్టు ఎంపిక
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్
- శనివారం సమావేశం కానున్న బీసీసీఐ
T20 Cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ సమీపిస్తుంది. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీకి భారత్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. ఈ వరల్డ్ కప్ (World Cup) కోసం భారత జట్టును ప్రకటించేందుకు రేపు (శనివారం) బీసీసీఐ సమావేశం కానుంది. అయితే జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద సవాల్‌గా మారింది. సమతూకమైన జట్టును ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. కానీ భారత జట్టులోని కొందరి ఆటగాళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.

శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌ల ఫామ్ టీమిండియాకు (Team India) పెద్ద తలనొప్పిగా మారింది. జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఇటీవల పూర్ ఫామ్‌లో ఉన్నారు. పరుగులు చేయకపోవడంతో జట్టుకు భారంగా మారారు. మరి వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను, అలాగే సంజుశాంసన్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు వీరికి అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

వికెట్‌కీపర్ (Wicket Keeper) విభాగంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లు కీపర్లుగా కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్ నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్ రాలేదు.. అయితే, శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎడాపెడా మార్చి చివరకు ప్లేయింగ్ ఎలెవన్ నుంచే తొలగించారు.
గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్‌గా ఉన్న రింకూ సింగ్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌కు (Series) పక్కన పెట్టేశారు. వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌ను కోల్పోతాడా అనే చర్చ సైతం జరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం భారత జట్టు ఎంపికపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.
