ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితురాలి ధర్నా

బోధన్ టౌన్, ఆంధ్రప్రభ: ప్రేమ పేరుతో మోసం చేసి అన్యాయం చేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ (ఆర్డీవో) కార్యాలయం ఎదుట బాధితురాలు షైక్ సీమా బేగం తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. జల్లపల్లి ఫారం సర్పంచ్ దస్తగిరి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, శారీరకంగా వాడుకున్నాడని, రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, అనంతరం ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి ద్వారా తన గర్భాశయాన్ని తొలగించారని ఆరోపించారు. ఈ ఘటనతో తన జీవితం తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని బాధితురాలికి మద్దతు తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.