పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు

• మిడ్ మానేర్ బ్యాక్‌వాటర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
• పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి
• సరదా విషాదంగా మారకుండా అప్రమత్తంగా ఉండాలి: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పేర్కొన్నారు. సోమవారం తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని పోలీసు అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్‌వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాదంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది ఉన్నారు.