సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు
సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు
పెనుమంట్ర, పెనుగొండ, భీమవరం (ఆంధ్రప్రభ): దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర గనులు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో సోమవారం ఆయన రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా జిల్లాలో మరిన్ని సబ్స్టేషన్లు అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంపై అభివృద్ధి పనుల్లో వెనుకబాటు ఉందని విమర్శించారు.
అనంతరం పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.20.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆరోగ్య మందిర్ ప్రారంభించారు. గరువు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, నవుదూరు–బ్రహ్మణ చెరువు రహదారి, నెగ్గిపూడి ఎస్సీ, ఎస్టీ కాలనీలో సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
పెనుగొండ మండలంలో 132–33 కేవీ సబ్‌స్టేషన్‌లో 50 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. అలాగే వడలి–జాతీయ రహదారి-16 మధ్య రహదారి పనులను కూడా ప్రారంభించారు.
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్ల నిర్మాణాలకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇతర వర్గాలకు సబ్సిడీతో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో దాసి రాజు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, తహసిల్దార్లు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
