దూసుకొచ్చిన లారీ.. మహిళ దుర్మరణం..
మరిపెడ, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుని భీతావహ పరిస్థితి నెలకొంది. పాలవ్యాన్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరిపెడ మండలం ఆనేపురం స్టేజీ సమీపంలోని కుడియా తండా వద్ద ఆదివారం రాత్రి జరిగింది.
కుడియా తండాకు చెందిన అజ్మీర సుశీల (50) రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. వరంగల్ వైపు వెళ్తున్న పాలవ్యాన్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుశీల అక్కడికక్కడే మృతి చెందారు.
అదే సమయంలో పాలవ్యాన్ వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. మార్గమధ్యంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ఆటోను ఢీకొట్టడంతో పాటు భారీ జమాల్ వృక్షాన్ని ఢీకొట్టి కూకటి వేళ్లతో సహా పెకిలించి పడేసింది. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రభాకర్‌రావు, క్లీనర్ తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై గండ్ర సతీశ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు సుశీలకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
