ఘనపూర్‌కు విద్యుత్ వరం.. రూ.60.62 కోట్ల పనులకు భట్టి శ్రీకారం
ఘనపూర్‌కు విద్యుత్ వరం.. రూ.60.62 కోట్ల పనులకు భట్టి శ్రీకారం
జనగామ, ఆంధ్రప్రభ: జనగామ జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తిచేసుకున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభాధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ కుసు పాషా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 60,838 మంది వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.
వేలేరు మండలంలోని పీచరలో రూ.43.92 కోట్ల వ్యయంతో నిర్మించిన 2×10/16 ఎంవీఏ సామర్థ్యంగల 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే కొండాపూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.2.50 కోట్లు, సాగరం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.2.29 కోట్లు, కుర్చపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు.
చిల్పూర్ మండల పరిధిలో రూ.9.66 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఇందులో పల్లగుట్ట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.3.25 కోట్లు, లింగంపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.2.81 కోట్లు, నష్కల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.3.60 కోట్లు కేటాయించారు.
అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించిన రైతు సేవా కేంద్రం స్టాల్‌ను ఉప ముఖ్యమంత్రి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
తదుపరి సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

